ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. ‘వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు పడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరం. భారీ వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం.. వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టామని.. 17 వేల మందిని తరలించామని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామన్నారు.