ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : అదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నాన్ని మట్టిలో కలిపింది అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, ఇక్కడ బీఆర్ఎస్ నేత కేసీఆర్ లేనని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే కారణమన్నారు. అదిలాబాద్‌లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడారు. ఇరువురు కలిసి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచారు తప్ప నిరుద్యోగం లేకుండా చేయలేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యాల ద్వారానైనా తెరిచి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సభ ముఖంగా భరోసా కల్పించారు.
అదిలాబాద్ జిల్లా బోత్ పిచ్చోడ గుడిహత్నూర్ ఆదిలాబాద్ మండలాల లోని వేలాది ఎకరాల వ్యవసాయ సస్యశ్యామలం చేసేలా కుప్టీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలలోనైనా ఆధునాతనమైన సాంకేతిక పద్ధతులలో నిర్మించి తీరుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీకి పదేపదే ఎన్‌ఎస్‌యుఐ ఇతర కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులు తన దృష్టికి తీసుకువస్తున్నారని కచ్చితంగా ఆదిలాబాద్‌కు విశ్వ విద్యాలయాని తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.