హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో..
సీఎం రేవంత్ కౌంటర్..
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో : మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్‌కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు గన్‌పార్క్ వద్దకు రావడంపై సీఎం స్పందిస్తూ.. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా..? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని.. రాజీనామా లేఖ అలా ఉండదని చెప్పుకొచ్చారు.
హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారంటూ సెటైర్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదన్నారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘హరీష్.. ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్‌ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’’ అంటూ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.