రేపు సీఎం అధ్యక్షతన జిల్లా మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం
7న ఆలయ అభివృద్ధిపై సీఎం ప్రకటన?
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి భద్రాద్రి రామాలయం అభివృద్ధిపై ఫోకస్పెట్టబోతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం యాదాద్రి పున: నిర్మాణం చేస్తే.. దానికి రెండింతలు భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఈనెల 7న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాములోరి సన్నిధిలో శ్రీకారం చుట్టబోతున్న సమయంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రకటన చేయనున్నారు. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచలం రామాలయం అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో త్రదిదండి చిన జీయర్‌స్వామి, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు రూపొందించారు.
అయితే అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రణాళికల అమలుకు రూ.150కోట్లు కేటాయించిన ఎనిమిదేళ్లలో చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. దీన్ని అటకెక్కించారు. అయితే ఈ ప్రణాళికల ఫైళ్లకు గత రెండు రోజుల నుంచి అధికారులు బూజు దులిపి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బుధవారంనాడు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం.