Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు గానూ 1,031 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. ఈ మేరకు 20,632 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలో కాంగ్రెస్ పార్టీ 46 నుంచి 50 సీట్లు, బీజేపీకి కేవలం 20 నుంచి 32 సీట్లు మాత్రమే దక్కనున్నట్లు సర్వే వెల్లడించింది. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 21 సీట్లు, కాంగ్రెస్ పార్టీ మాత్రం 59 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది. రిపబ్లిక్ భారత్, మ్యాట్రిజ్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 62 సీట్లు దక్కించుకోగా.. బీజేపీకి మాత్రం 18 నుంచి 24 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈనెల 8న హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.