Trending Now

కాంగ్రెస్ ‘జూబ్లీ’ విజయం

భారీ మెజారిటీతో నవీన్ గెలుపు
రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్
డిపాజిట్ కూడా దక్కించుకోని బీజేపీ

(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో మొదట పోస్టల్ ఓట్లను లెక్కించారు. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఆధిత్యాన్ని కొనసాగించింది. మొత్తం పదిరౌండ్లు కౌంటింగ్ జరగగా. ప్రతి రౌండ్ లోను కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కనబరిచింది. తుది రౌండ్ ముగిసే సమయానికి 24, 729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఉప ఎన్నిక గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో మంత్రులను ఇన్చార్జులుగా నియమించి, పకడ్బందీగా ప్రచారం చేశారు. పక్కాగా పోల్ మేనేజ్మెంట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క మెజార్టీ సాధించడానికి కృషి చేశారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఈ ఉప ఎన్నికలో డిపాజిట్ గల్లంతు కావడం విశేషం.

ప్రజా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితంతో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాల‌న‌పై ప్రజ‌ల‌కు సంపూర్ణ విశ్వాసం ఉంచార‌న్న విష‌యం స్పష్టమైంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. అబ‌ద్దాలు, అవాస్తవాలు, విష‌ ప్రచారాలు చేసిన పార్టీల‌కు జూబ్లీహిల్స్ ఓట‌ర్లు క‌ర్రుకాల్చి వాత‌పెట్టార‌ని అన్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని త‌మ నోటికి తాళం వేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. సీఎం రేవంత్‌ రెడ్డి కార్యద‌క్షత‌కు ఈ ఫ‌లితం ఒక రెఫ‌రెండ‌మ్‌గా నిలిచింద‌ని అన్నారు. ప్రజ‌లిచ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని జూబ్లీహిల్స్ ప్రజ‌ల సేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని కోరారు. ఇందుకు ప్రభుత్వం త‌ర‌పున అన్నివేళ‌లా స‌హాకారం ఉంటుంద‌ని, ఎన్నిక‌లలో ఇచ్చిన హామీల‌ను వీలైనంత త్వర‌గా నెర‌వేరుస్తామ‌ని అన్నారు. ముఖ్యంగా తాను ఇన్‌ఛార్జిగా వ్యవ‌హ‌రించిన రహ్మత్ న‌గ‌ర్ డివిజ‌న్‌లో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ కి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love

Related News