ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి మార్స్ 28: ప్రభుత్వ నిబంధనల మేరకు లే-అవుట్, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలిసి ఆయన జిల్లా స్థాయి లే-అవుట్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలోని పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ లే-అవుట్, భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
అక్రమ లే-అవుట్, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను కమిటీ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ రత్నాకల్యాణి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ రాజ్, ఆర్&బి శాఖల ఇంజనీరింగ్ అధికారులు శంకరయ్య, అశోక్ కుమార్, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి సుమలత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.