Trending Now

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం..

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 06: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ హైమద్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆకుల రాజు గౌడ్ ల ఆధ్వర్యంలో సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సోమవారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 10 సంవత్సరాల పాలనలో ఈ దేశానికి చేసింది శూన్యమని, రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు కలగానే మిగిలాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేస్తూ భద్రత లేకుండా చేస్తుందని విమర్శించారు.

కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని తీవ్రంగా సంక్షోభంలోకి నెట్టివేసిందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు అడ్డగోలుగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని, దేవుళ్ళ పేరుతో మత రాజకీయాలకు పాల్పడుతూ.. ప్రజాస్వామ్య రాజకీయ విలువలను నాశనం చేస్తూ మత కల్లోలాలు సృష్టిస్తున్న బీజేపీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ దొర అహంకారంతో ఒంటెద్దు పోకడతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నియంతలా వ్యవహరించిన బీఆర్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల మల్లయ్య, తోళ్ల వేణు, అమరగొండ మల్లేష్, తాటికొండ సుభాష్, డప్పు రాజేందర్, పౌడాల శివ, పెద్దముత్తని పోషయ్య, పెద్దముత్తని చందు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News