సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 16: మోడీ చేస్తున్న భావోద్వేగ మత రాజకీయాలను ఓడిద్దామని, దేశ సమర్ధత,ఆర్ధిక విధానాలను నాశనం చేయడమే బీజేపీ అజెండా అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో జరిగిన సీపీఐ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోదీ, దేశ హోంమంత్రి అమిత్ షా లతో అంబానీ, అదానీ లు మేమిద్దరం, మాకు ఇద్దరు అంటూ దేశ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారని, ఈ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, మతోన్మాద బీజేపీ ని ఓడించాలని వారు పిలుపునిచ్చారు.
దేశ పరిపాలనను మోడీ అంబానీ, అదానీల విధానాలనే అనుసరిస్తున్నాడని వారు ధ్వజమెత్తారు. 56 ఇంచుల ఛాతీ తో దేశాన్ని రక్షిస్తున్నానని,అభివృద్ధి చేస్తున్నానని మోడీ ప్రగల్బాలు పలుకుతున్నారని ఇప్పటికే దేశంలో అర్ధాకలితో ప్రజలు ఆలమతీస్తున్నారని అన్నారు. హిందూత్వానికి యజమానులు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కాదని… దేశ ప్రజలే యజమానులని ఉద్ఘాటించారు. మోడీ చర్యలన్ని పురుషాధిక్యతకు అద్దం పడుతాయని, అందుకే అయోధ్యలో కేవలం సీతా దేవి లేని రాముడు విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారని విమర్శించారు. భౌతిక వాదులైన కమ్యూనిస్టు లు నిరంతరం ప్రజలకు అవసరమైన విధానాలపై పోరాటాలు చేస్తారని, అటువంటి భౌతిక వాదులపై దేశ వ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ దాడులు చేయడాన్ని దేశ ప్రజాస్వామిక వాదులంతా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
అయోధ్య లో రామ మందిర అంశం ద్వారా మరో మారు గెలవాలనే మోదీ పన్నాగాలు, ఓట్లు వస్తాయనే ఆశలు కనుమరుగయ్యాయని అందుకే ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులపై ఈడీ, సీబీఐ ద్వారా అరెస్ట్ లు చేసి గెలవాలనే నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని వారు ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన10సంవత్సరాల కాలంలోనే హిందువులు ప్రమాదంలో పడ్డారని వారు అన్నారు. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా భౌతిక వాదులు, జర్నలిస్టులు, ప్రశ్నించే గొంతుకులపై అధికారాన్ని, అణచివేతను ప్రయోగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యం పై దాడులుగా అభివర్ణించాలన్నారు.దేశంలో అవినీతిని అంతం చేస్తానని చెబుతున్న మోడీ, ప్రస్తుతం మోడీ పాల్గొంటున్న అన్ని ప్రచార సభల్లో వేదికలపై పాల్గొంటున్న మెజారిటీ నేతలంతా అవినీతిపరులు కాదా, వారంతా బీజేపీ నేతలేగా అని వారు ప్రశ్నించారు.
మోడీ చేస్తున్న ఉదారవాద రాజకీయాల కారణంగా మనుషుల మధ్య దూరం ఏర్పడిందని, ప్రశ్నించే తత్వాన్ని పౌరులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుష్టులు చెప్పే అంశాలే నిజమనే భావనలో ఉంటున్నారని, పోరాటాల దిశగా ఆలోచనలు చేయడం లేదని వారు అన్నారు. అదే విధంగా మోడీ గతాన్ని కీర్తించడం, భవిష్యత్ ను గొప్పగా అభివర్ణిస్తున్నారని, మరి వర్తమానం గురించి ఎందుకు చెప్పడం లేదో దేశ ప్రజలు గమనించాలని, కేవలం అబద్ధాలను ప్రచారం చేయడమే మోడీ భజన పరుల నినాదమని వారు విమర్శించారు. దేశ వ్యాప్తంగా 45శాతం గ్రాడ్యుయేట్ లు నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. ఎలెక్టోరల్ బాండ్లు అవినీతి బాండ్లని, దాదా వసూళ్ల బాండ్లని వారు అన్నారు.మోడీ 10 సంవత్సరాల కాలంలో తన బ్రాండ్ ఇమేజ్ కోసం కొన్ని కోట్లకు పైగా ఖర్చు చేశారని ,ఇవి దేశ ప్రజల డబ్బు అని వారు అన్నారు.
అందుకే దేశంలో ప్రస్తుతం భావోద్వేగ పూరిత మత రాజకీయాలు నడుస్తున్నాయని, దీనిని పౌరులంతా తిప్పి కొట్టాలని మతతత్వ రాజకీయాలకు దేశంలో చోటు లేదని, సర్వ మత సమ్మేళనమే భారతదేశమని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు గడిపే మల్లేష్,కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోనగిరి రూపేష్,వేల్పుల శ్రీనివాస్,పిల్లి రజిని, జేరిపోతుల జనార్దన్,ఎగ్గొజు సుదర్శన చారి,బొజ్జపురి రాజు,అయిలేని సంజీవ రెడ్డి,సంగెం మధు,కర్ణాల చంద్రం తదితరులు పాల్గొన్నారు.