ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్. ఎన్నికల్లో మద్దతుకు బదులుగా సీపీఎం నేతల ముందు కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో కీలక రాజకీయ అంశాలపై తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చర్చించామన్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ స్థానంలో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. దానికి తాము అంగీకరించలేదని చెప్పారు. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధం ఉన్నప్పటికీ.. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు కొనసాగుతుందని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. శనివారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అవ్వగా.. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.