షాద్ నగర్ నియోజకవర్గం కందివనంలో విషాదం
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
ప్రతిపక్షం, మహబూబ్ నగర్: ఏం జరిగిందో తెలియదు కానీ ఓ డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకొని మరణించింది. అయితే అది ఆత్మహత్య..? లేక హత్య..? అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికి బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో షాద్ నగర్ పొలీస్ స్టేషన్లో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో మానస అనే డిగ్రీ విద్యార్థిని నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఉరి వేసుకున్న పరిస్థితుల మధ్య మానస కనిపించడం అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాములు ఉరివేసుకున్న సమయంలో అక్కడే ఉండడం కుటుంబ సభ్యులకు అనుమానాలకు తావిచ్చింది.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీస్తే తనకు ఫోన్లు చేసే వాడినని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. రాములు.. మానసను రెండో వివాహం చేసుకునేందుకు వేధించడం పట్ల మానస తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అదేవిధంగా మృతి పట్ల అనుమానాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో అనుమానాలు ఉండడంతో మెరుగైన నివేదిక కోసం ఉస్మానియాకు తరలించినట్లు బాధితులు పేర్కొంటున్నారు.
మానస ది హత్యే.. యువసత్తా లక్ష్మణ్
కందివనం గ్రామానికి చెందిన విద్యార్థిని మానసది హత్యేనని షాద్ నగర్ యువ సత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పట్టణంలోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మానస అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు రాములు అక్కడే ఉన్నాడని అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఆరోపించారు. ఈ సంఘటనలో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం, మృతురాలి కుటుంబ సభ్యులపై రాజీకోసం ఒత్తిడి పెంచడం కొన్నిడబ్బులు ముట్టజెప్పి కేసును ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని లక్ష్మణ్ మీడియాకు తెలిపారు.
రాములు వేధించడం వల్లే మానసకు ఈ గతి పట్టిందని పేర్కొన్నారు. మానస మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. రాములును అత్యంత కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని తమ తల్లిదండ్రులతో చెప్పుకోవాలని అప్పుడు ఇలాంటి అనర్ధాలు జరగవని అన్నారు. చదువుకునే క్రమంలో బయట ఎదురవుతున్న పరిస్థితులు, సమస్యలను విద్యార్థులు ఆకలింపు చేసుకుని కళాశాలలో గురువులకు లేదా ఇంట్లో తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు లేదా తాము నమ్మిన వ్యక్తులకు తమ సమస్యలు చెబితే సూచనలు, సలహాలు లభిస్తాయని ఇలాంటి పరిస్థితి ఏర్పడదని విచారం వ్యక్తం చేశారు. అనేక విషయాలు దాచిపెడుతుండడంతో భవిష్యత్తులో వారికి కష్టాలు, నష్టాలు తప్పడం లేదని విద్యార్థులు మానసిక పరిపక్వతను కలిగి సమస్యలను ఎదుర్కోవాలని లక్ష్మణ్ సూచించారు. మానస కుటుంబానికి అన్యాయం తల పెడితే ఆందోళన తప్పదని లక్ష్మణ్ హెచ్చరించారు.