ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి వారం ఇద్దరు మంత్రులతో సమావేశమై వారి శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘సందీప్ పాఠక్’ రాబోయే రోజుల్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు సీఎం కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు.
కేజ్రీవాల్‌కు జుడీషియల్ కస్టడీ పొడిగింపు..
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు జుడీషియల్ కస్టడీని పొడిగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. ఈ కేసులో మార్చి 21న అరెస్టైన ఆయన తిహార్ జైలులో ఉంటున్నారు.
ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు..
ఈడీ తనను అరెస్టు చేయడం, రిమాండ్‌కు తరలించడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు, తాజాగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోపు ఆ పిటిషన్‌పై స్పందించాలని అందులో సూచించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.