Rahul Gandhi criticizes NDA: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మీద, ఎన్డీయే మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన రాహుల్ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా విచ్ఛిన్నమైందన్నారు. దేశంలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. అంతేకాదు, ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ పాతరేసిందని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన చట్టసభ సభ్యుల్ని కొనుగోలు చేసి, వారిని బీజేపీ సభ్యులుగా మార్చుకున్నారని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని మండిపడ్డారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని అదే విధంగా లాక్కున్నారని చెప్పారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో దేశ ప్రజలు ఎన్డీయేకు బుద్ధిచెప్పారని, అందుకే మెజారిటీ భారీగా తగ్గిందనన్నారు.