Trending Now

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాలు కూల్చివేత..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్​రెడ్డి దుండిగల్​లోని చిన్నదామర చెరువు ఎఫ్​టీఎల్​ బఫర్​జోన్​లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు మున్సిపల్​, ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన మర్రి లక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజిలోని ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. చెరువు ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్దిచెప్పి, అనంతరం భవనాల కూల్చివేతను కొనసాగించారు.

ఇటీవలే రోడ్డు..

ఇటీవలే మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాల రోడ్డును అధికారులు తొలిగించిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించి ఆయన కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులుకు మేడ్చల్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించేశారు.

Spread the love

Related News

Latest News