Devara Movie: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమాతో జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. అదే విధంగా జనతా గ్యారేజీ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా, ఏపీ ప్రభుత్వం ‘దేవర’ స్పెషల్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయంపై ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ‘దేవర’ మూవీ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు, స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తెలుగు సినిమాకు సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.