కెరీర్ లో సహకరించినవారందరికీ ధన్యవాదాలు
ప్రకటన విడుదల చేసిన స్టార్ వికెట్ కీపర్
ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు దినేశ్ శనివారం ఒక ప్రకటన చేశాడు. అతడు చివరిసారిగా మే 22న ఐపీఎల్ ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ‘ కొన్ని రోజులుగా నాకు లభించిన ఆప్యాయత, మద్దతు, ప్రేమ వెలకట్టలేనిది. ఈ అనుభూతిని సాధ్యం చేసిన అభిమానులందరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు’ అంటూ దినేశ్ తన ప్రకటనలో వివరించాడు. బాగా ఆలోచించిన తరువాతనే తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. తన కెరీర్ లో సహకరించిన కోచ్లు, కెప్టెన్లు, సెలెక్టర్లు, సహచరులు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. ‘మన దేశంలో క్రీడలు ఆడే మిలియన్ మందిలో, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించిన కొద్దిమంది అదృష్టవంతులలో నన్ను నేను భావిస్తున్నాను. చాలా మంది అభిమానులు, స్నేహితుల ఆదరాభిమానాలను సంపాదించుకోవడం ఇంకా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’ అని దినేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. తనతో కలిసి నడవడానికి, తన కెరీర్ను నిలిపివేసినందుకు- భారతీయ ప్రొఫెషనల్ స్క్వాష్ క్రీడాకారిణి అయిన తన భార్య దీపికా పల్లికల్కి కృతజ్ఞతలు తెలిపాడు. ‘అభిమానులు, అనుచరులందరికీ ధన్యవాదాలు. క్రికెట్, క్రికెటర్లు, మీ మద్దతు, శుభాకాంక్షలు లేకుండా ఉండరు’ అని ప్రకటనను ముగించాడు.