ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు శాఖల వారిగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి, దరఖాస్తుల పరిశీలన చేపట్టి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి, రెవెన్యూ, వ్యవసాయం, కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూ సమస్యల వంటి అంశాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీ.ఆర్ఓ భుజంగ్ రావు, ఆర్డీఓ రత్నాకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.