నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం నిర్మల్ గ్రామీణ మండలం అక్కాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడి, ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, రాగిజావ, ఇతర ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని తల్లిదండ్రులకు వివరించారు.
ఐదు సంవత్సరాలు నిండిన ప్రతీ విద్యార్థిని పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకముందు పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కార్యక్రమంలో భాగంగా జరిగిన పనులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందజేయు ఏకరూప దుస్తులను ప్రధానోపాధ్యయులకు అందజేశారు. అనంతరం చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో ప్రవేశానికి కలెక్టర్ ప్రవేశపత్రం అందజేశారు. పిల్లల్ని అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించడం వల్ల పోషకాలతో కూడిన ఆహారం, వారి మేధస్సు పెరిగేందుకు రకరకాల ఆటపాటలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం బడిబాట ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.
ఆ తర్వాత నిర్మల్ గ్రామీణ మండలంలోని కొండాపూర్ మండల సమైక్య వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ ఈజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేపల చెరువును ఆయన పరిశీలించారు. రైతులు చేపల చెరువు ఏర్పాటు చేసుకోవడం వలన లాభాలను పొందవచ్చని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విధంగానే ప్రతి మండలానికి 30 మంది రైతులను గుర్తించి చేపల చెరువు ఏర్పాటు దిశగా వారిని ప్రోత్సహించాలని అధికారులనకు సూచించారు. ఈ కార్యక్రమాలలో డీఈవో రవీందర్ రెడ్డి, డిఆర్డిఓ విజయలక్ష్మి, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.