ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : నిర్మల్ రూరల్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల అక్కాపూర్ నందు ఈరోజు ప్రో. జయ శంకర్ బడిబాట కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, గౌరవ జిల్లా విద్యా శాఖాధీకారి ఏ. రవీందర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. బడి బాట కార్యక్రమంను ఈ రోజు నుండి అనగా జూన్ 6 నుండి జూన్ 19 వరకు ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం ప్రతీ రోజు జిల్లా లోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలలో ఘనంగా నిర్వహించి, అత్యధిక నమోదును సాధించాలని సూచించారు.
బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, బడి ఈడుగల పిల్లలందరినీ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలోనే నమోదు చేయాలని సూచించారు. గ్రామంలోని బడి ఈడుగల పిల్లలను, బడి బయట గల పిల్లలను బాల కార్మికులను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే నమోదు చేస్తామని, హాజరు అయిన సభ్యులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అంగన్వాడి కేంద్రం నుండి ముగ్గురు పిల్లలను ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో స్వయంగా నమోదు చేయించారు. గ్రామ స్వయం సహాయక సంఘ సభ్యులు కుట్టించి తెచ్చిన ఒక జత ఏకరూప దుస్తులను గౌరవ కలెక్టర్ గారు తన చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి, బడిబాట ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.తర్వాత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న త్రాగునీరు, మరుగుదొడ్లు,విద్యుత్ మరియు చిన్న చిన్న మరమ్మత్తులు వంటి వాటిని పరిశీలించారు. పాఠశాలకు అవసరమైన మరిన్ని పనులను కూడా ఎస్టిమేట్ వేసి, చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గజానన్ రావు, డీపీ ఆర్ ఓ విష్ణు, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, డీఈ తుకారాం, ఏ. ఈ. శరీక్ అలీ ఖాన్, మండల విద్యాధికారి కస్తూరి శంకర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఎన్. ప్రవీణ్ కుమార్, అకాడమీ మానిటరింగ్ అధికారి నర్సయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్, పాఠశాల ఉపాధ్యాయులు, రూమ్ టు రీడ్ సభ్యులు, అంగన్వాడి సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.