సరఫరాకు గల అవకాశాలను పరిశీలించాలి..
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 15 : సింగరేణి గనుల నీటితో జిల్లాలో త్రాగునీరు సరఫరా చేసేందుకు గల అవకాశాలను పరిశీలించి.. నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత సింగరేణి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ్ శ్రీ తో కలిసి సింగరేణి బొగ్గు గనుల నుంచి పంప్ చేస్తున్న నీటిని త్రాగునీరుగా మలిచి సరఫరా చేసేందుకు గల అవకాశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆర్జీ-1, ఆర్జీ-2 , ఆర్జీ-3 గనుల నుంచి ప్రతి రోజూ దాదాపు 132 ఎం.ఎల్.డి నీరు పంపింగ్ చేస్తున్నామని, వీటిలో సింగరేణి అవసరాలకు వినియోగించుకున్న తరువాత దాదాపు 100 ఎం.ఎల్.డి నీటిని వ్యవసాయ నిమిత్తం విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. సింగరేణి ఆర్జీ-1 గని నుంచి నీరు విడుదలయ్యే ఎర్ర చెరువు, నల్ల చెరువు, ఆర్జీ-2 గని నుంచి నీరు విడుదలయ్యే జల్లారం వాగు, ఆర్జీ-3 గనుల్లోంచి నీరు విడుదలయ్యే బోక్కల వాగు నుంచి నీటిని త్రాగునీటి సరఫరా కు మళ్లించేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
సింగరేణి బొగ్గు గనుల నుంచి వచ్చే నీటిని ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ది చేసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్ లైన్ వ్యవస్థను వినియోగించుకుంటూ రామగుండం పట్టణం, పరిసర గ్రామాలకు త్రాగు నీటి సరఫరా చేసే అంశంపై సాధ్యాసాధ్యాలు గురించి ప్రతిపాదనలు మూడు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ పూర్ణ చందర్, ఈఈ మిషన్ భగీరథ ఇంట్రా జి.శ్రీను, సింగరేణి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.