జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు ఈవీఎం యంత్రాల పనితీరు, ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. ఎన్నికకు ముందే సెక్టోరల్ అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వారికి కేటాయించిన రూట్ మ్యాప్‌ను సరిపోల్చుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్, విద్యుత్ ఫర్నిచర్ వంటి సౌకర్యాలను పరిశీలించాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులు ఎన్నికల రోజున తప్పకుండా ఒక పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ లో పాల్గొనాలని ఆదేశించారు.
పోలింగ్ తర్వాత ఖచ్చితంగా సీఆర్‌సీ ప్రక్రియను చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ అధికారులకు సంబంధించిన పేరు సెల్ నెంబర్లతో కూడిన సమాచారాన్నిఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలను సమయానికి పంపాలని ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి మూడు సెట్ల ఈవీఎంలు అందజేస్తామని, ఎన్నిక జరుగుతున్న సమయంలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లయితే పై అధికారుల ప్రోటోకాల్ ప్రకారమే ఈవీఎంలను మార్చాలని సూచించారు. పోలింగ్ సమయంలో సెక్టోరల్ అధికారులు ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని రెండుసార్లు సందర్శించాలని ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాసులు ఈవీఎం ల పనితీరు, ఎన్నికలలో సెక్టోరల్ అధికారుల విధులపై వివరించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ భుజంగ్ రావు, నిర్మల్, బైంసా, ఉట్నూర్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి, జివాకర్, సెక్టో రల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.