జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి భాయి
ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 14: డెంగ్యూ ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. కళావతి భాయి సూచించారు. మంగళవారం డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చాప్ల తండా గ్రామ పంచాయతీ పరిధి లోని ధరావత్ తండాను ఆమె సందర్శించారు. ఇటీవల కాలంలో ధరావత్ తండాలో ఐదు డెంగు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పాజిటివ్ వచ్చిన ఇళ్లను వారి సమీపంలోని 62 గృహలకు స్ప్రే చేయించడం జరిగింది. తండాలోని ప్రతి గృహమును సందర్శించి తండా వాసులకు డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా దోమలు మధ్యాహ్నం పూట కుట్టడం ద్వారా డెంగ్యూ వస్తుందన్నారు. దోమలు లేకుండా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వారానికి రెండు సార్లు మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటిని నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చూసుకోవాలని, అలాగే స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా పరిసరాల పరిశుభ్రతపైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రోగ్రాం అధికారులు డాక్టరు నాగేశ్వర్ రావు, డాక్టర్ శ్రవణ్, డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఇన్చార్జి డి పి హెచ్ ఎన్ వో మంగమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.