పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్యుల భద్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసింది. విధుల్లో ఉన్న వైద్యురాలిపైన ఇంతటి దారుణం జరగడం పట్ల వైద్యుల్లో ఒకరకమైన అభద్రతాభావం ఏర్పడినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఘటన నేపథ్యంలో వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల ఓ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన 3885 మంది ప్రభుత్వ/ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. వీరిలో 85శాతం మంది 35ఏళ్లలోపు వారే. సర్వేలో పాల్లొన్న వైద్యుల్లో 24.1శాతం మంది నైట్ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని, మరో 11.4శాతం మంది అత్యంత ఆందోళన వ్యక్తంచేసినట్లు తేలింది. ఇలా భయపడుతోన్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులే ఉన్నారు. నైట్ షిఫ్టుల్లో డ్యూటీ రూమ్ లేదని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది పేర్కొన్నారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.