చెంబూరు ఆచార్య మరాఠే కళాశాల సంచలన నిర్ణయం
ప్రతిపక్షం నేషనల్ బ్యూరో, ముంబై, జూలై 2: మహారాష్ట్రలోని చెంబూరు ఆచార్య మరాఠే కళాశాల మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులు బురఖా ధరించడంపై నిషేధం విధించిన కళాశాల ఇపుడు జీన్స్ మీదా నిషేధం విధించింది. జీన్స్, టీషర్టులు ధరించిన విద్యార్థులను కళాశాల ఆవరణలోకి అనుమతించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు స్పష్టమైన డ్రెస్ కోడ్ నిర్దేశించింది. విద్యార్థులు ప్యాంటు, హాఫ్ లేదా ఫుల్ షర్ట్, విద్యార్థినులు శరీరాన్ని పూర్తిగా కప్పే ఏదైనా ఇండియన్, వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని రావాలని సూచించింది. అయితే, కళాశాల యాజమాన్యం సంకుచిత వైఖరితో వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం విధించిన డ్రెస్ కోడ్ నిబంధనలు తమ రాజ్యాంగబద్ధమైన మత, సాంస్కృతిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని అంటున్నారు. ఈ అసంబద్ధ నిబంధనల కారణంగా’40 మందికి పైగా విద్యార్థులు కాలేజీ గేటు బయట వేచి ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీని వలన తాము క్లాసులు మిస్ అవడమే కాకుండా, రోజూ కాలేజీకి ఏం దుస్తులు ధరించి రావాలోననే ఒత్తిడికి కూడా గురవుతామంటున్నారు. కాగా, కొన్ని రకాల జీన్స్, టీషర్టులపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ విద్యాగౌరి లేలే తెలిపారు. వాటిని వర్గీకరించడానికి బదులు విద్యార్థులందరికీ జీన్స్, టీషర్టులపై నిషేధం విధించామన్నారు. తమ విధానాలను వివరించడానికి విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాతానని చెప్పారు. విద్యార్థులు సంప్రదాయబద్ధంగా, సంస్కారయుతంగా ఉండాలనేదే తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.