దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
ప్రతిపక్షం, దుబ్బాక, మే13: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. సోమవారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన అతిపెద్ద ఆయుధం ఓటు హక్కు అని అన్నారు. రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును దాదాపు 90 శాతం వరకు వినియోగించుకుంటున్నారని అదే తరహాలో పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును కేవలం 57 శాతం వరకు మాత్రమే వినియోగించుకోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువకులు ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు కీలకమైందని గుర్తించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు హక్కును వినియోగించుకోకపోవడం అతి ప్రమాదకరమని ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి యువకుడు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని భారతదేశం లోని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరారు.