ప్రతిపక్షం, దుబ్బాక, మార్చి 30: కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తున్నారు.. తప్ప.. రైతులను పట్టించుకోవడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం కాసులాబాద్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులలో ఉన్న నీటిని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మేడిగడ్డ బూచిపెట్టి నీటిని సముద్రం పాలు చేస్తున్నారు తప్ప, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందన్నారు.
ఇప్పటికే మిరుదొడ్డి, చేగుంట, నార్సింగ్, దుబ్బాకలో పంటలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయని.. ఉన్న కరెంటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ అధికారికి ఫోన్ చేసిన మంత్రి ఆదేశాలు ఇవ్వాలని అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతన్నల కష్టాలు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలకు సరిపడా సాగునీరును అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.