2024 Dussehra Holidays For Schools: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వం అధికారికంగా దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. దాదాపు 13 రోజులు సెలవులు రానుండటంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత తిరిగి అక్టోబర్ 15 వతేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ తెలిపింది.
అయితే, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ, దసరా పండుగలు వస్తుండడంతో వరుసగా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.