Earthquake in srikakulam: ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజామున 3.40 నిమిషాలకు భూకంపం చోటుచేసుకుంది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే కాసేపటికే మళ్లీ భూకంపం వచ్చింది. ఉదయం 4.03 నిమిషాలకు మరోసారి భూమి కంపించడంతో బయటకు వచ్చారు. దాదాపు మూడు సెకన్ల వరకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాగా, రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలో భూకంపం వచ్చిందని, అప్పటినుంచి తరచూ వస్తున్నాయని చెబుతున్నారు. తాజాగా, మళ్లీ భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన భూకంపాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.