నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 6 : పవిత్ర రంజాన్ మాసం ముగింపు రోజున ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు నిర్వహించుకునే ప్రార్థనలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత ఈద్గా వద్దనే నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకుగాను ముందస్తుగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరి ఏడు కూడా వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో చారిత్రాత్మక ఈద్గాం ప్రాంతంలో ఈద్గా ఉండగా పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతున్నాడని గుర్తించిన అప్పటి పాలక పక్షాలు, అధికారులు సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామ సమీపంలో సుమారు కొన్ని ఎకరాల అటవీ భూములలో నూతన ఈద్గా నిర్మాణం చేపట్టారు. అయితే అది కాస్త వివాదాస్పదంగా మారడంతో అటవీశాఖ అధికారులు తమ ఉన్నత స్థాయి అధికారులు, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సదరు ఈదిగాకు వెళ్లకుండా ప్రధాన మార్గాన్ని అడగడుగునా భారీ గోతులతో త్రవ్వి వేయడమే కాకుండా తగిన విధంగా హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
అయితే ఈ ఏడు పవిత్ర రంజాన్ మాసం అనంతరం నిర్వహించుకునే ప్రార్థనలు పాత ఈద్గాలోనా..! కొత్త ఈద్గాలోనా..? అంటూ పట్టణ, పరిసర ప్రాంతాల వాసులు ఎదురు చూస్తుండగా పురపాలక సంఘం నిర్మల్ ఆధ్వర్యంలో పాత ఈదిగాలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాడంతో ఈ ఏడు ఈద్గాలోనే కచ్చితంగా ఈద్-ఉల్-ఫితర్ ప్రార్ధనలు జరుగుతాయని స్థానికులు విశ్వాసిస్తున్నారు. అయితే నిర్మల్ పురపాలక సంఘం కమిషనర్ సి వి ఎన్ రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ పాత ఏర్పాట్లను చేస్తున్నారు.