ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 22 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు శ్రీ కొద్రి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి గురువారంతో ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో కిషన్ రావు, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ లు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చల్లని పందిళ్లు, త్రాగునీటి వసతి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని అతిపెద్ద విగ్రహంతో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడినదని.. రేణుక ఎల్లమ్మ పేరుతోనే ఇక్కడ అతిపెద్ద చెరువు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఉన్నది. ఈ జాతర నెల రోజులపాటు అంగరంగ వైభావంగా కొనసాగుతుంది.
గురువారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, సాయంత్రం బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఆది, మంగళ, శుక్రవారం రోజులలో శ్రీ రేణుక అమ్మవారికి కుంకుమార్చనలు ఒడిబియ్యం, బోనాలు పట్నలతో జాతర వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఎల్లమ్మ జాతరకు స్థానిక పట్టణ గ్రామీణ ప్రజలే కాకుండా ఉమ్మడి కరీంనగర్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎల్లమ్మ జాతర సందర్భంగా ఆలయ గుడి పూజారులు కమిటీ సభ్యులు గుడిని సుందరంగా తీర్చిదిద్దారు. జాతరలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.