నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో స్వీప్ ( సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ లకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఈ నెల 13 న నిర్వహించనున్న పోలింగ్ లో జిల్లాలోని ఓటర్లందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కు అనేది ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని, ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొని ఆదర్శంగా నిలవాలని కోరారు.
పోలింగ్ కేంద్రాలలో వికలాంగుల కోసం ర్యాంప్, వీల్ చైర్స్ వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని వికలాంగులకు, 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో 636 మందికి హోం ఓటింగ్ సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేలా స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విస్తృతం చేయాలనీ సూచించారు. అనంతరం ట్రాన్స్ జెండర్స్ కి కలెక్టర్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి కే. నాగమణి, అధికారులు, సిబ్బంది, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, తదితరులు పాల్గొన్నారు.