- దసరా నుంచి అందరికీ మంచి శుభం కలగాలి
- రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి
- దసరా వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు
ప్రతిపక్షం బ్యూరో, సిద్దిపేట: చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లోని నర్సాపూర్, రంగాధంపల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో నిర్వహించిన దసరా వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడారు. రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించడంతో రామ రాజ్యం వచ్చిందన్నారు. ఈ విజయదశమి అందరికి మంచి శుభం జరిగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్యాలు, సంకల్పం నెరవేరాలని, అమ్మవారి దయతో ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలు నెరవేరాలని ఆశిద్దామన్నారు.
సిద్దిపేట.. రాష్ట్రంలోనే నంబర్ వన్
సిద్దిపేట అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, సిద్దిపేటకు దేశంలో ఒక ప్రత్యేకత ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం సైతం సిద్దిపేట స్టీల్ బ్యాంకు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకు రైలు మెడికల్ కాలేజ్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గోదావరి జలాలు తీసుకొచ్చి మన దశాబ్దాల కలను నెరవేర్చుకున్నామన్నారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ మూడు టీఎంసీలతో నిండుకుండలా ఉందన్నారు. దీంతో లక్ష ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నామని చెప్పారు. త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైళ్ల రాకపోకలు సాగుతాయన్నారు.