ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారులో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని, నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్, బీజేపీ లు నట్టేట ముంచాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం దుబ్బాక మండలంలోని పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే తో పాటు, ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామ రెడ్డి తో కలిసి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిచిపోతుందని, ధాన్యం కొనుగోళ్ల లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
దుబ్బాక ప్రాంతం కరువు, కటకాలకు కేరాఫ్ గా నిలిచిందని, మాజీ సీఎం కేసీఆర్ చొరవతో కాళేశ్వరం నీటిని బీడు భూముల్లో పారించడం జరిగిందన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని, మన కూడవెల్లి కి గోదావరి నీళ్లు వచ్చేవా అని ఆయన గుర్తు చేశారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తామని, మహిళలకు మహాలక్ష్మి పథకం లో నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఓట్లకు వస్తే అడుగడుగునా కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. రైతులను, మహిళలను, నిరుద్యోగులను, అన్ని వర్గాల వారిని వారు మోసం చేశారన్నారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాటను కూడా వారు అపహాస్యం చేశారన్నారు. 4వేల పించన్ ఇస్తామని 44 లక్షల మందికి డోఖా చేశారన్నారు.
అడబిడ్డలకు స్కూటీ లు ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేసారన్నారు. డిసెంబర్ 9 తర్వాత 2 లక్షల ఋణమాపీ చేస్తామని, రైతు భరోసా ద్వారా 15 వేలు, కూలీలకు 12 వేలు ఇస్తామని ఇవ్వడం లేదన్నారు. విదేశాల్లో నల్లధనం తీసుకువచ్చి పేదలకు పంచుతామని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు, మోసం మాటలు మాట్లాడిన రఘునందన్ కు దుబ్బాకలో గత ఎన్నికల్లో బుద్ది చెప్పారన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో ఎలా చెల్లుతుందన్నారు. వెంకట్రామరెడ్డి ని నాన్ లోకల్ అంటున్న రఘునందన్ రావు గతంలో పఠాన్ చెరువు లో జడ్పీటిసి గా పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. తెల్లాపూర్ లో నివాసం ఉంటున్న లోకల్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి కి ఘన విజయం అందించాలన్నారు. నాడు కేసీఆర్ రంజాన్ తోపాతో పాటు ఇమామ్, మొజాం లకు జీత భత్యాలు ఇవ్వడం జరిగిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బంధు చేశారని, మైనారిటీ లు అర్థం చేసుకోవాలన్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ముంపు బాధితులు తమ సమస్యలను వివరించగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.దుబ్బాక అంటే ఉద్యమాలకు అడ్డా అని, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యావంతుడుగా, జిల్లా కలెక్టర్ గా పేరు గాంచిన మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి కి భారీ మెజారిటీ అందిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమం జోరందుకుందన్నారు.నాడు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ల సహకారంతో వేల కోట్లతో దుబ్బాకలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఎంపీ గా మెదక్ పార్లమెంటు పరిధిలో సిద్దిపేట, మెదక్ కు రైలు సౌకర్యం, చేగుంట రహదారి పై ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు, సిద్దిపేట కు కేంద్రీయ విద్యాలయం తీసుకు రావడం జరిగిందన్నారు. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకు భారీ మెజారిటీ అందించారని ,ఎంపీ ఎన్నికల్లో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి కి భారీ మెజారిటీ అందించాలని కోరారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు.. 100 కోట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దుబ్బాక అభివృద్ధి కి ప్రభాకర్ రెడ్డి తో కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీనియర్ నాయకులు మనోహరరావు, సోలిపేట సతీష్ రెడ్డి, కత్తి కార్తీక తదితరులు పాల్గొన్నారు.
కరికే రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు..
దుబ్బాక మండలంలోని గంభీర్ పూర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీమసేన తండ్రి కరికె రాజయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయనను పరామర్శించారు. రాజయ్య చిత్ర పటానికి నివాళి అర్పించి, ప్రగడ సంతాపం ప్రకటించారు. అలాగే అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నీరటి రాజశేఖర్ కుటుంబాన్నిపరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.