ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్
అధికారుల అలసత్వమా..? ప్రభుత్వ నిర్లక్ష్యమా..?
ప్రతిపక్షం, దుబ్బాక, మే 28: అధికారుల అలసత్వమో.. ప్రభుత్వ నిర్లక్ష్యమో..? కానీ అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు అసలే వర్షాకాలం రైతులు విత్తనాలు వేసుకునే సమయంలో విత్తనాలు అందక రైతులు నిరుత్సాహానికి గురవుతున్న సంఘటన మంగళవారం దుబ్బాక పట్టణంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం ముందు కనిపించింది. వర్షాకాలం పంట సమయంలో రైతులు జిలుగు జనము విత్తనాల కోసం దుబ్బాక పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడి వేచి చూసిన కొంత మంది రైతులకు మాత్రమే విత్తనాలు అందడంతో అక్కడున్న అధికారులను ప్రశ్నిస్తే వారి నుండి నిర్లక్ష్యం సమాధానం రావడంతో మిగిలిన రైతులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాతలకు అన్ని విధాల అండగా ఉంటుందని అనుకున్నాము కానీ ఇంతవరకు రైతన్నలకు విత్తనాలు అందించలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతన్నలకు ఇటువంటి కష్టాలు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతన్నలకు సరిపడా ఎరువులను విత్తనాలను అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో అన్నదాతల ఆగ్రహానికి అధికారులు, ప్రభుత్వం గురి కావల్సి వస్తుందని హెచ్చరించారు.