42 మంది ఉమ్రా యాత్రికుల సజీవ దహనం!
అందరూ హైదరాబాద్ వాసులే
బస్సును ట్యాంకరు ఢీకొనడంతో దుర్ఘటన
మృతుల సంఖ్యను ధ్రువీకరించని సౌదీ అధికారులు
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
(ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధి)
మక్కా(సౌదీ అరేబియా), నవంబర్ 17: మక్కా నుండి మదీనాకు భక్తులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు సోమవారం ఉదయం డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో కనీసం 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం మహిళలు, పిల్లలు సహా 42 మంది మృవాత పడినట్లు తెలుస్తోంది. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారు. 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు మృతులలో ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మక్కాలో తమ ఆచారాలను పూర్తి చేసుకున్న యాత్రికులు మదీనాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని సమాచారం. స్థానిక వర్గాలు 42 మంది మరణించినట్లు చెబుతున్నప్పటికీ, అధికారులు ఇప్పటికీ క్షతగాత్రుల సంఖ్య, ప్రాణాలతో బయటపడిన వారి పరిస్థితినే ధ్రువీకరిస్తున్నారు.
సీఎం రేవంత్దిగ్భ్రాంతి
తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని, తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు వెంటనే ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ తో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్లు: +91 79979 59754, +91 99129 19545
ఘటన కలిచివేసింది: మంత్రి పొన్నం
సౌదీ ఎన్నారై అడ్వైజరీ కమిటీతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం చాలా బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారన్న వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. సౌదీ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ , వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగిందని, అధికారులకు ఎన్నారై కమిటీతో సమన్వయం చేస్తూ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. మృతులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ప్రభుత్వం వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు.
తీవ్ర విచారకరం: ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం సేకరించడానికి సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను తాను సంప్రదించానని, వారి వివరాలను ఇప్పటికే సేకరించామని, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబు మాథెన్ జార్జ్‌తో కూడా మాట్లాడిన్టుల ఒవైసీ తెలిపారు.



























