ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మధ్యపద్రేశ్ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్ భవన్’లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగగా.. భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని.. 20 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. మూడో అంతస్తులో భద్రపర్చిన కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.