Heavy Rains Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయింది. శనివారం రాత్రి మొదలైన వాన ఆదివారం సాయంత్రం వరకు దంచికొట్టింది. వర్ష బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 100కుపైగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 18 మంది మృతి చెందారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో రెండు కార్లు కొట్టుకొచ్చాయి. ఓ కారులో మృతదేహాన్ని గుర్తించారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటు కారేపల్లి గంగారం తండాకు చెందిన మోతీలాల్, ఆయన కుమార్తె అశ్విని కారులో వెళ్తుండగా.. బ్రిడ్జి వద్ద అదుపుతప్పింది. వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభించగా.. మోతీలాల్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మద్దూరు మండలం ఎక్కమేడ్ గ్రామంలో బారీ వర్షాలకు ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతురు మృతి చెందారు.