Trending Now

మహనీయుల కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిజం చేశాం..

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 11: మహనీయులు డా. బీఆర్‌ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబు జగ్జీవన్ రామ్ కన్న కలలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిజం చేసామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని తన నివాసం లో మహాత్మా జ్యోతిబా పూలె 198వ జయంతి సందర్బంగా పూలె చిత్ర పటానికి పూల మాల వేసి హరీష్ రావు నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి.. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకం అన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అన్నారు. ఆయన ఆశయాలు, ఆశలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ పాలన కొనసాగించిందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని వ్యాఖ్యానించారు. ఫూలే ఆశయ సాధన దిశగా మహిళలకు గురుకుల విద్యతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. వెనకబడినవర్గాల విద్యాభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసి, అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పాం అని బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించి, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు. బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ‘ఫూలే బీసీ విదేశీ విద్యానిధి’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేసామన్నారు.

Spread the love

Related News

Latest News