ప్రతిపక్షం, అమరావతి: ఏపీలోని మాజీ మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల ఆవేదన.. 2014 ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచి, జలవనరుల శాఖను నిర్వహించిన ఉమ, తరువాతి (2019) ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉప్పు, నిప్పులా ఉంది.‘తమలపాకుతో ఒకటిస్తే తలుపు చెక్కతో రెండిస్తా’.. తరహాలో ఇద్దరి మధ్య వివాదం నడిచింది. మారిన రాజకీయ పరిణామాలలో వసంత వైకాపాకు వీడ్కోలు పలికి, అక్కడి నుంచే టీడీపీ తరపున పోటీకి సిద్దమయ్యారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు అంగీకరించి మొదటి జాబితోలొనే ఆయన పేరు ప్రకటించారు.
ఈ సీటును ఆశిస్తున్న ఉమ సహజంగా నిరాశపడ్డారు. చంద్రబాబు మాట శిరోధార్యమైనా, కనీసం తనకు వేరే నియోజకవర్గమైనా కేటాయించాలని ఉమ కోరినట్లు వార్తలు వచ్చాయి. అదలా ఉంటే అధినేత పిలిచి బుజ్జగించారు. తనకు, ఉమకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, విజయానికి కలసి పనిచేస్తామని వసంత చెప్పారు. చంద్రబాబు సమక్షంలో అన్ని విషయాలు చర్చిస్తామని, పరిస్థితులు చక్కబడతాయని అశాభావం వ్యక్తంచేశారు.





























