Trending Now

పాలమూరులో నీళ్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిందే కాంగ్రెస్ అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు బాగోలేదని.. ఆయన తీరు మార్చుకోవాలని సూచించారు. రేవంత్ సభలో మాట్లాడిన మాటలకు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఇష్టానుసారంగా తిడుతున్నారని మండిపడ్డారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం సాగు నీరు ఇవ్వలేదని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు.

పాలమూరులో నీళ్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ సమస్యలు తీవ్రమయ్యాయని అన్నారు. వలసల జిల్లాగా పాలమూరును మార్చింది కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర ఏంటీ? అని నిలదీశారు. పాలమూరులో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటీ? అని ప్రశ్నించారు. కొడంగల్‌లో రేవంత్ చేసిన శంకుస్థాపనలు గత ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకొచ్చినవేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన పాపాల వల్లనే పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News