హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: పార్టీల పరిస్థతి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడితే ఆ పార్టీ తిరుగులేకుండా చలామణి అవుతూ ఉంటుంది. అదే ప్రజలు ఒక్కసారి తిరగబడితే ఆ పార్టీ పరిస్థితి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణాలో పదేళ్లపాటు ఇక తిరుగులేదన్న విధంగా ఎదిగిన బీఆర్ఎస్(గతంలో టీఆర్ఎస్)పార్టీ పరిస్థితి ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఘోరంగా మారింది. రాష్ట్రం, జిల్లా, తాలూకా, మండలం, గ్రామాల్లో ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్పార్టీ మూడు మాసాల క్రితం అధికారం కోల్పోవడంతో నేడు పార్టీ ఉనికికే ప్రమాదంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
గతంలో ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ టికెట్ కోసం నాయకులు పోటీ పడేవారు. గత మూడు మాసాల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అంటూ ప్రకటించిన ఆ పార్టీ మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు నేడు పోటీ చేయాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలో పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్‌పార్టీకి రోజు రోజుకు ప్రజాధరణ పెరుగుతుండడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేతలు నెత్తిపట్టుకుంటున్నారు. గతంలో సిట్టింగ్ స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ ప్రకటించిన చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి నేడు పోటీకీ ససేమీరా అంటున్నారు. దీంతో ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి కోసం గులాబిబాస్ అన్వేషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం ముందుకు రావడంలేదు.
అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ రాకకీయాలు రసకందాయంలో పడ్డాయా? అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఫలితాల తర్వాత పార్లమెంటుకు సై అన్న అనేక మంది నతేలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు..? ఎక్కడి నుంచైనా సిద్ధమే అన్న నేతలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారట. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత తన కొడుకు పోటీ చేస్తారంటూ అందుకు టికెట్ కేటాయించాలంటూ కోరిన విషయం తెలిసిందే!
అయితే తాజాగా తన కొడుకుకు టికెట్ ఇస్తానంటే కూడా వద్దంటున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ లోక్‌సభకు పోటీ చేస్తానంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఓ మాజీ మంత్రి బహిరంగంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు ఆయన ససేమీరా అనడంతో, సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆయన అయిష్టంగానే ప్రకటించినట్లు బీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటామన్న ఆ నేతలు.. పోటీపై ఎందుకు పునరాలోచనలో పడ్డారు..? ఇపుడు పార్టీ అధిష్టానంపై ఆ నేత అసంతృప్తితో ఉన్నారా..? అన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే భువనగిరి లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది.
కష్టకాలంలో పార్టీకి షాక్..
ప్రస్తుతం పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో నేతలు పార్టీకి షాక్ ఇస్తున్నారు. పదేళ్లపాటు పలు పదవులు చేపట్టిన నేతలు, అలాగే మంత్రులుగా ఉన్న నేతలు సైతం పార్టీకి ఊతమివ్వడంలేదన్న చర్చ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌లో గత అయిదేళ్లలో తిరుగులేని మంత్రిగా కొనసాగిన శ్రీనివాస్‌గౌడ్ నేడు పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికి పార్టీకి సహాయం చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం.