హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్‌పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పుతో పోయిందని చెప్పారు. మహారాష్ట్రలో శివసేనను వీడిన ఏక్ నాథ్ షిండే గ్రూప్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర స్పీకరును కోర్టు ఆదేశించిందని చెప్పారు. స్పీకర్‌కు కోర్టులు కాలపరిమితి విధిస్తున్నందున అనర్హత పిటిషన్‌పై ఇక వాయిదాలు కుదరవని హెచ్చరించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచే ఆయన శాసన సభా సభ్యత్వం రద్దయినట్టేనని చెప్పారు. స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడే 1985లో రూపొందించారని అన్నారు. రాజీవ్ గాంధీ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులు ప్రోత్సహించకూడదని చెప్పారు. ప్రతిమ ముల్టీఫ్లెక్స్‌లో ఎన్నికల అధికారులకు దొరికింది తన బంధువుల డబ్బులు అని తనకు ఏం సంబంధం లేదని వినోద్ కుమార్ అన్నారు.