ప్రతిపక్షం, నల్గొండ: వ్యవసాయ కార్మికులందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుథవారం ఆయన పరిశీలించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, కూలీలనుదేశించి ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే పాలకులు ఆదుకునే స్థితిలో లేకపోవడం మూలంగా ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి దాపురించిందని, కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 20 లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు పనిచేసే చోట ఫోటోలు తీయాలని అప్లోడింగ్ చేస్తేనే హాజరు పడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం వలన ఇంటర్నెట్ సౌకర్యం పనిచేస్తున్న ప్రాంతంలో కలవకపోతే హాజరు పడకపోవడం మూలంగా ఉపాధి కార్మికులు నష్టపోతున్నారని వెంటనే అప్లోడింగ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీలో పని చేస్తున్న కార్మికులకు నెలలు తరబడి వేతనాలు రాకపోవడంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చినవెంకులు, గ్రామ అధ్యక్షులు పులిపెళ్లి లలిత, ప్రధాన కార్యదర్శి సిపంగి కవిత, నాయకులు నూనె పద్మ, బుర్రి శేఖర్ రెడ్డి, నర్రా అలివేలు, వనమ అండాలు, బుర్రి లక్ష్మమ్మ, రెమిడాల ముత్యాలు, దూదిగామ సాలమ్మ, బెల్లపు పద్మ, జాల పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.