Trending Now

300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సెమెంజాకు అవార్డును అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుంది..’అన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయోఏషియా సదస్సు కీలకంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని అన్నారు.

వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు. ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందని, అయితే సమస్యల పరిష్కారాలను కూడా మనం కలిసికట్టుగానే సాధించాలని సీఎం సూచించారు. ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్ లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. “మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్ లా మా ప్రభుత్వం పనిచేస్తుంది” అని సీఎం వ్యాఖ్యానించారు.

ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఏటా 5కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తే లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ ఇక్కడి బయోలాజికల్-ఈ సంస్థతో కలిసి హైదరాబాద్ లో తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. వైరస్ ల వల్ల ప్రపంచంలో నెలకొన్న భయాలకు హైదరాబాద్ నుంచి నమ్మకాన్ని కల్పిస్తున్నామని సీఎం అన్నారు. జర్మనీకి చెందిన మిల్టేనీ సంస్థ తన రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని చెప్పారు. మానవాళికి మంచి చేసే చర్చలు, ముందడుగుతో హైదరాబాద్ బయో ఏషియా సదస్సు విజయవంతం కావాలని సీఎం ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News