ప్రతిపక్షం, హైదరాబాద్, ఏప్రిల్ 08: ప్రజలకు నమ్మకం కలిగేలా టౌన్ ప్లానింగ్ శాఖ అధికారుల పనితీరు ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 7వ అంతస్తు మీటింగ్ హాల్ లో టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులతో ఆయా అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బిల్డింగ్ పర్మిషన్ లకు సంబంధించి టీ ఎస్ బి పాస్ లో ఏ దరఖాస్తును అయినా 21 రోజులలోగా పరిష్కరించాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనల మేరకు అర్హత గల దరఖాస్తులను అప్రూవల్ చేయడం, లేని వాటిని రిజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. గ్రీవెన్స్ లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించడం పై దృష్టి సారించాలన్నారు. తమ తమ గ్రీవెన్స్ లాగిన్ లో ఉన్న పెండింగ్స్ దరఖాస్తులన్ని వారంలోగా క్లియర్ చేయాలనిఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అశ్రద్ధ వహించవద్దని, టైం బాండ్ కేసులలో వెంటనే చర్యలు చేపట్టాలని, జోన్, సర్కిల్ వారిగా పెండింగ్ కేసులకు సంబంధించి కౌంటర్ వేయాలని సూచించారు.
మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేసుకోవాలన్నారు. శిధిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలని సూచించారు. మైనర్/మేజర్ జంక్షన్ కు సంబంధించి తమ తమ సర్కిల్ లో గల ఇబ్బందులను గుర్తించి, ఎలాంటి ఆస్తులకు నష్టం జరగకుండా జంక్షన్ ఇంప్రూవ్ మెంట్స్ కొరకు ప్రతి సర్కిల్ నుండి పది జంక్షన్ సంభందించిన ప్రాపర్ ప్లాన్స్ సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గల నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి ఆక్రమణలు, నిర్మాణాలు జరగరాదని స్పష్టం చేశారు. లేక్స్ ప్రొటెక్షన్ వాట్సాప్ గ్రూప్ లలో టౌన్ ప్లానింగ్ వారిని చేర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. న్యాక్ ఇంజనీర్లు అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించాలని, సుమోటో గా, ఫిర్యాదులకు సంబంధించిన వాటిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ సిసిపి లు, సీపీ లు, ఏసీపీలు, న్యాక్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.