గ్రాట్యుటీ పరిమితి 25 శాతం పెంపు
ప్రతిపక్షం నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ, జూన్ 1: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ యేడాది మార్చి ఏడున నాలుగు శాతం డీఏ పెంచిన ప్రభుత్వం తాజాగా గ్రాట్యుటీ పరిమితిని కూడా 25 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు చేరుకుంది. ఈ నిర్ణయం ఈ యేడాది జనవరి ఒకటి నుండి అమలులోకి వస్తుంది. ‘ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) నిబంధనలు 2021 కింద రిటైర్మెంట్ గ్రాట్యుటీ, అలాగే, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 25 శాతం అంటే రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచారు. ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది’ అని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల విభాగం పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ కార్యాలయం తెలిపింది.