హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామంటూ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం అమలు కాకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కాంగ్రెస్‌పై కొంత గుర్రుగానే ఉన్నారు. పెన్షన్ల సొమ్మును పెంచుతామంటూ చెప్పి పెంచలేదని, పెంచకపోవడంపై విపక్షాలు సైతం ఎన్నికల అస్త్రంగా తీసుకున్నాయి. దీంతో ఇక చేసేదీ ఏమీ లేక రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెన్షనర్లకు శుభవార్త చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద ఇవ్వనున్న పెన్షన్లపై పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే ఎన్నికల కోడ్ ముసిగిన వెంటనే కొత్త పింఛన్ అంటే సాధారణ పింఛను రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, అలాగే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్న వారికి కూడా ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కొత్త పింఛను కోసం భారీగా దరఖాస్తులు..
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు గానూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త పింఛన్ల కోసం 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు వెరిఫై చేసి ఇప్పుడున్న లబ్ధిదారులతో వారితో పాటు కొత్తవారికి కూడా లోక్‌సభ ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే ఇస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డులపై కూడా ప్రకటన: నూతన రేషన్ కార్డుల కోసం కూడా ఎదురుచూస్తున్న వారికి మంత్రి పొన్నం గుడ్‌న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.