హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆరు గ్యారంటీలతో పాటు యువత మద్దతు సంపూర్ణంగా కూడగట్టుకునేందుకు సీఎం రేవంత్ సర్కార్ భారీ కసరత్తును ప్రారంభించింది. లోక్ సభ ఎన్నికల్యలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధిష్టాన వర్గం ముందు మార్కులు కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కొలువుల జాతర ప్రారంభం కానుంది. కొత్త నోటిఫికేషన్‌లకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్ట్‌లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మరోవైపు సింగరేణి లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. 474 పోస్టుల భర్తీకి సింగరేణి అధికారులు కసరత్తు మమ్మరం చేశారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో సింగరేణి అధికారులు సమావేశం అయ్యారు. ఇప్పటికే 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అన్ని నోటిఫికేషన్‌లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.