Harish Rao Takes On Revanth Reddy Vastu Changes: సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్‌తో సచివాలయం నిర్మించిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తు పిచ్చితో సీఎం రేవంత్‌రెడ్డి మార్పు చేస్తున్నారని విమర్శలు చేశారు. సచివాలయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూటకో మార్పులు చేస్తున్నారని హరీష్ రావు విమర్శలు చేశారు. ఒక్క వాస్తు దోషం ఉందని చెప్పి ఏకంగా గేట్ మార్పు కోసం రూ.4 కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. మార్పు చేయాల్సింది సచివాలయంలో గేట్లు కాదని, పాలన చేస్తున్న వ్యక్తుల్లో అంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది అయితే అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చేస్తున్నారని పలువురు అంటున్నారు. దీంతో ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయ ప్రధాన మహా ద్వారం ఈశాన్యం వైపునకు మారనుంది. దీంతోపాటు ప్రస్తుతం సచివాలయంలోని ఆగ్నేయంవైపు ఉన్న గేటు నంబర్-2 నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపున్న గేటు నంబర్-4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని నిర్మిస్తున్నారు.