ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రానున్న మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక, విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గ గుడి పైవంతెనను సైతం తాత్కాలికంగా మూసివేశారు.